వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర... ఆద్యంతం కోలాహలంగా సాగుతోంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకూ మూడు నెలలపాటు నిర్వహించే ఉత్సవాలకు.. తెలుగు రాష్ట్రాలతోపాటు... ఛత్తీస్గఢ్ , మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా మల్లన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తుండడం వల్ల జాతర జనసంద్రంగా మారుతోంది. దేవాలయ ఆవరణలోనే భక్తులు విడిది చేసి బోనాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. మము గాచు మల్లన్నా... అంటూ భక్తులు దండాలు పెడుతూ దర్శనాలు చేసుకుంటున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేయగా...సంతానం కోసం మహిళలు వరాలు పట్టి...కోడెలు కట్టేందుకు పోటీలు పడ్డారు.
పట్నాలు వేసి..
ఆలయ గర్భగుడిలో ఉత్తరం వైపు భక్తులు టెంకాయ ముడుపు కట్టడం ఇక్కడ ఆనవాయితీ. గండాలు తీరితే గండ దీపం, కోరికలు తీరితే కోడెను కట్టడం అనేది ఇక్కడి తరతరాల ఆచారం. యాదవుల కులదైవంగా కొలుస్తున్న మల్లికార్జున స్వామిని ఒగ్గు కళాకారులు పసుపు, బియ్యం పిండితో పట్నం వేసి కొలుస్తారు. ఇలా చేయడాన్ని స్వామి వారికి కల్యాణంగా భావిస్తారు. జాతరకు వచ్చే భక్తులు పట్నం వేసి మట్టి కుండల్లో నైవేద్యం తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా రథం ఊరేగింపు
సంక్రాంతి పర్వదినం సాయంత్రం రోజు.. ఐనవోలు జాతరలో పెద్ద బండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వంశపారంపర్యంగా మార్నేని వంశీయుల ఇంటి నుంచే పెద్ద బండి రథం ప్రారంభమవుతుంది. జాతర మూడో రోజున పెద్ద బండి రథం ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు మంగళహరతులతో రథానికి స్వాగతం పలుకుతూ దారి పొడువునా మొక్కులు చెల్లించుకుంటారు.
ఇదీ చదవండి: కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు