Inavolu Mallanna Temple : జానపదుల జన జాతరగా కీర్తి గడించిన ఐనవోలు మలన్న జాతరకు తెరలేచింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న శివభక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఐనవోలు మల్లన్నను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆలయాభివృద్ధికి ప్రత్యేక గ్రాంటు ఇచ్చేందుకు అంగీకరించారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.
"ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు కట్టించారు. గత ముఖ్యమంత్రులెవరూ ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాభివృద్ధికి ప్రత్యేక గ్రాంటు ఇచ్చేందుకు అంగీకరించారు. నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ శుభకార్యం ప్రారంభించినా ఈ ఆలయంలో మల్లన్న స్వామిని దర్శనం చేసుకుని మొదలుపెడతాను". - మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు
ఆలయానికి తరలివచ్చే అశేష భక్తజనానికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికారులు, పాలకవర్గం భారీగా ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ.. జనానికి అవస్థలు తప్పడం లేదు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, స్నానపు గదులు, డ్రెస్సింగ్ రూములు, పార్కింగ్ సౌకర్యం ఇలా అన్నింటా ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. ప్రభుత్వం సౌకర్యాల కల్పనకు రూ.12 లక్షలు ఖర్చు చేసినా.. ఎక్కడా భక్తుల అవసరాలకు సరిపోయేలా లేవని ఆరోపిస్తున్నారు. అధికారులు ఊహించినదాని కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు చేతులెత్తేశారు. స్వామి వారి దర్శనానికి ఐదారు గంటల సమయం పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలతో ఎండ దాటికి.. తాగునీరు లేక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
"దర్శనానికి చాలా సమయం పడుతోంది. త్రాగునీరు సౌకర్యం లేదు. అధికారులను ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి దర్శనం కోసం ఎండలో నిలబడేసరికి చిన్నపిల్లలకు బాగా ఇబ్బంది అవుతోంది". -భక్తులు
నిర్వాహకులు మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. వాస్తవానికి అనుకున్నదానికంటే ఎక్కువగా భక్తులు తరలిరావడం వల్లే చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. భోగి పండుగను పురస్కరించుకుని భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
"భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. వాస్తవానికి అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీటిని అందిస్తున్నాం. ధర్మ దర్శనంలో ఉన్న భక్తులకు ఆలస్యం కాకుండా ప్రత్యేక దర్శనాలను అనుమతించడం లేదు." - ఆలయ ఈవో
ఇవీ చదవండి:
తెలంగాణ ఆచరించింది.. దేశమంతా అనుసరిస్తోంది: మంత్రి హరీశ్‌రావు