గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత వరదతో కాళేశ్వరం బ్యారేజీల్లో జలకళ ఉట్టిపడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి బ్యారేజికి భారీగా వరద వస్తుండటంతో... 85 గేట్లకు గానూ 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం వరకు 35 గేట్లు తెరిచి ఉంచగా బుధవారం 57 గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి 4 లక్షల 46వేల 200 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా... 4లక్షల 30వేల 600 క్యూసెక్కులను కిందికి వదిలారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను 11.40 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కర ఘాట్లను తాకుతూ నీరు ప్రవహిస్తోంది.
గోదావరి పరవళ్లు..
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు 27.7 అడుగులు ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 29.5 అడుగులకు పెరిగింది. పర్ణశాలలోనూ గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. కూనవరం మండలంలోని శబరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి వరదతో ఆనందపురం, మల్లెలమడుగు గ్రామాల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతు వాగు, ఇసుక వాగు పొంగి ప్రవహించడంతో ఐదు పంచాయతీల్లోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్‌లోకి వరదనీరు చేరి నిర్మాణ పనులు స్తంభించాయి. భద్రాచలంలోని లోతట్టు కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బూర్గంపాడు మండలం సారపాక - ఇరవెండి గ్రామాల మధ్య రహదారిపైకి వరద చేరి రాకపోలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అలుగు పారుతూ ఆహ్లాదకరంగా..
రాష్ట్రవ్యాప్తంగా జోరువానలతో పలు జిల్లాల్లోని చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో అలుగు పారుతూ ఆహ్లాదకరంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్ చెరువు మత్తడి దూకుతోంది. ఐదేళ్ల తర్వాత అలుగు పారుతుండడంతో భూగర్భ నీటిమట్టం పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగుపై నిర్మించిన చెక్డ్యాంకు గండి పడింది. పొలాల్లోకి నీళ్లు వచ్చి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు