వరంగల్ అర్బన్‌తో పాటు మిగతా ఐదు జిల్లాల్లో గత నెల రోజులుగా అసలు ఆహార తనిఖీలు లేవు. కారణం ఆరు జిల్లాలకు కలిపి ఉన్నది ఒకే అధికారిణి. నిబంధనల ప్రకారం ప్రతీ జిల్లాలో నెలకు కనీసం 6 చోట్ల ఆహార తనిఖీలు చేపట్టాలి. దీంతో పాటు ఫిర్యాదులు వచ్చిన చోటకు వెళ్లి తనిఖీలు చేసి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపి ఫలితం వచ్చాక చర్యలు తీసుకోవాలి. కానీ ఉమ్మడి వరంగల్‌లో ఆహార తనిఖీ అధికారి ఒక్కరే ఉన్నారు.
ఆ ఒక్కరికి కూడా వాహనం లేకపోవడంతో తనిఖీలు తన వల్ల కాదని పైఅధికారులకు చెబుతున్నారు. ఇక ఈ కార్యాలయాన్ని పర్యవేక్షించాల్సిన ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారిణి విధులకు రాకపోవడంతో కార్యాలయంలో పనిచేయాల్సిన యూడీసీ, అటెండర్లు కూడా విధులకు ఎగనామం పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కార్యాలయానికి కేటాయించిన వాహనం డ్రైవర్ కూడా విధులకు రాకపోవడంతో తనికీలకు ఉన్న ఒక్క అధికారిణి వెళ్లలేకపోతున్నారు.
భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో కూడా ఆహార తనిఖీలు లేకుండా పోయాయి. భూపాలపల్లిలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి వరంగల్ కార్యాలయంలోనే సంతకాలు పెట్టుకొని వెళ్లిపోతున్నాడు. ఈనాడు-ఈటీవీ భారత్ కార్యాలయాన్ని పరిశీలించగా ఒక్క అధికారిణి మాత్రమే కనిపించారు. పర్యవేక్షణాధికారిణి కుర్చీతో సహా అన్ని కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి.
ఇదీ చూడండి: ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదు: హైకోర్టు