పట్టాదారు పాసుపుస్తకాలు రాక వరంగల్ ఉమ్మడి జిల్లాలోని చాలా మంది రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సొంత భూములున్నా బ్యాంకు రుణాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు దూరమవుతున్నారు. పెట్టుబడి సాయం పొందలేక పోతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినా పూర్తిస్థాయిలో పాసు పుస్తకాలు పంపిణీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర జాప్యం జరుగడం వల్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
తిరిగి.. తిరిగి.. వేసారి..
అన్నదాతలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్థానిక అధికారులు మాత్రం చూద్దాం.. చేద్దామంటూ.. వారిని తిప్పించుకొంటున్నారు. తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు జిల్లాల్లో 9,37,600 పట్టదారు ఖాతాలుండగా 6,88,727 పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇంకా 2,48,873 అందజేయాలి. సకాలంలో అందకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు. అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న ఖాతాల్లో ఏదో ఒక సమస్య ఉందంటూ.. వాటిని త్వరలోనే సరిచేసి అందజేస్తామని సాకులు చెబుతూ పంపిస్తున్నారు.
సవరణలోనూ జాప్యమే..
పంపిణీ చేసిన పాసు పుస్తకాల్లో కూడా తప్పులు దొర్లాయి. పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, తదితర తప్పులు రావడంతో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. వాటిని తిరిగి ముద్రిస్తున్నారు. వాటిని కూడా తిరిగి పంపిణీ చేయడంలోనూ జాప్యమే జరుగుతోంది. డిజిటల్ సైన్ చేయడంలో, ధరణి వెబ్‌సైట్‌లో వివరాల నమోదులో కూడా ఆలస్యమవుతోంది. ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు సకాలంలో అందడం లేదు.
అందని సాయం.
పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రెండు పంటలకు రూ. 10 వేలు, పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేల చొప్పున పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు రైతుబంధు, ఒకసారి కిసాన్ సమ్మాన్ కింద పెట్టుబడి సాయం అందింది. పట్టాలు రాని రైతులు సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.
కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా
బుర్హన్‌పురం గ్రామస్థుడు - పెద్దబోయిన అయిలయ్యకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. అతనికిచ్చిన పాసుపుస్తకంలో విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారు. సరి చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ... నేటికి సరి చేసి ఇవ్వలేదని వాపోతున్నాడు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. అధికారులను అడిగితే ఇస్తామంటూ దాటవేస్తున్నారు.
అందరికీ అందజేస్తాం
ఎలాంటి వివాదం లేని భూములకు పాసుపుస్తకాలు అందిస్తున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ డేవిడ్ తెలిపారు. అభ్యంతరాలు ఉన్న చోట్ల... సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అర్హులైన వారందరికీ పట్టాలు అందజేస్తాం.
ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం