Green Field National Highway: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు తమ భూములను ఇచ్చేదిలేదని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామ రైతులు తేల్చి చెప్పారు. అభివృద్ధి పేరుతో పచ్చని పంట పండే భూములను లాక్కోవడం ఏంటని సంబంధిత అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం, సర్వే చేయడం, నివేదిక ఇవ్వడం పట్ల రైతులు మండిపడుతున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో విజయవాడ నుంచి నాగపూర్ వరకు నూతనంగా నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.
లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యే శరణ్యం
ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములను ఎట్టి పరిస్థితిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం ఇచ్చేది లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సంవత్సరానికి మూడు పంటలు తీసే తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యే శరణ్యం అంటూ జిల్లా అదనపు కలెక్టర్ ముందు మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
న్యాయం జరిగేలా వ్యవహరించాలి: కోదండరాం
రైతుల అభిప్రాయాలను విన్న అదనపు కలెక్టర్ పై అధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులు రావడం మంచిదే కానీ.. రైతులకు నష్టం జరుగకుండా రోడ్డు వేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం సూచించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని తెలిపారు. దిల్లీలో ధాన్యం కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్.. అదే తరహాలో గ్రీన్ ఫీల్డ్ హైవే దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: