Family Members Reaction on Pravalika Suicide : నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై తాజాగా కుటుంబసభ్యులు స్పందించారు. తన కుమారుడు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారని యువతి తల్లి విజయమ్మ తెలిపారు. తమలాగా పిల్లలు కూలీ పనులు చేసుకోవద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో కష్టపడి కోచింగ్ ఇప్పించామన్నారు. కానీ ఓ యువకుడు ప్రేమ పేరుతో ప్రవళికను వేధించాడని.. ఆ వేధింపులు తట్టుకోలేకే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే తాము బిడ్డపోయిన బాధలో ఉన్నామని.. రాజకీయాలుంటే ఆయా పార్టీలు చూసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
Pravallika Last Rites Complete : అశ్రునయనాల మధ్య ప్రవల్లికకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
ప్రేమ వేధింపులు తట్టుకోలేక మా బిడ్డ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనులు చేసుకొని నా కుమారుడు, కుమార్తెలను పెంచి పెద్ద చేశాం. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో కోచింగ్ కోసం రెండేళ్ల క్రితం ఇద్దరినీ హైదరాబాద్ పంపించాం. ప్రేమ పేరుతో శివరామ్ అనే యువకుడు వేధించడం వల్లే మా బిడ్డ చనిపోయింది. ప్రవళిక ఆత్మహత్య విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఏమైనా ఉంటే పార్టీల పరంగా చూసుకోవాలి తప్పితే... మమ్మల్ని ఉపయోగించుకోవడం తగదు. - మర్రి విజయమ్మ, ప్రవళిక తల్లి
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత
Pravalika Suicide Case Update : శివరామ్ అనే యువకుడు తమ సోదరిని తరచూ వేధించేవాడని ప్రవళిక సోదరుడు మర్రి ప్రణయ్ తెలిపారు. చదువుకునే సమయంలో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడని.. కాల్ లిఫ్ట్ చేయకపోతే తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసేవాడని వివరించారు. శివరామ్ వేధింపులు తట్టుకోలేక తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. శివరామ్‌ను ఎన్కౌంటర్ చేస్తేనే ప్రవళిక ఆత్మ శాంతిస్తుందన్నాడు. ఈ క్రమంలోనే ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు వచ్చి తమను ఇబ్బందిపెడుతున్నారని.. సోదరి చనిపోయిన బాధలో తాము ఉంటే ఇంటికి వచ్చి రాజకీయాలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలన్నారు.
స్నేహితురాలి ద్వారా మా అక్కకు శివరామ్ పరిచయమయ్యాడు. చదువుకునే సమయంలో తరచూ ఫోన్ చేసి వేధించేవాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అక్క ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. శివరామ్ వేధింపులు తట్టుకోలేకే మా అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది. శివరామ్‌ను ఎన్కౌంటర్ చేస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది. కాంగ్రెస్ నాయకులు తరచూ ఇంటికి వచ్చి ప్రవళిక ఆత్మహత్య విషయంలో కల్పించుకుంటున్నారు. ఇప్పటికే బాధలో ఉన్నాం. మమ్మల్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరైంది కాదు. - మర్రి ప్రణయ్, ప్రవళిక సోదరుడు
శివరామ్‌పై కేసు నమోదు..: ఇదిలా ఉండగా.. ప్రవళిక ఆత్మహత్య ఘటనలో చిక్కడపల్లి పోలీసులు శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. శివరామ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ మేరకు ప్రవళిక తన సోదరికి మెసేజ్ చేసినట్లు గుర్తించారు. యువతి కుటుంబ సభ్యులు సైతం ఇదే విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. దీంతో శివరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం శివరామ్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలిపారు.