ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో ఆయన పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్‌లో భాజపా నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈటల జిందాబాద్ అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బును, కుట్రను నమ్ముకుంటారని.. ప్రజలను నమ్ముకోరని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ ధనానికి, దుర్మార్గాలకు ఘోరీ కట్టే సమయం ఆసన్నమైందని ఈటల ధ్వజమెత్తారు. తాను డబ్బుని, కుట్రను నమ్మకోలేదని... నమ్ముకున్నది నియోజకవర్గ ప్రజలలేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యాయం, ధర్మమే గెలుస్తుంది..
రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్‌లో ఏం జరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. పార్టీలో నుంచి నేను వెళ్లలేదు.. కావాలనే వారు వెళ్లగొట్టారు. ఒక సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి ఫిర్యాదు చేస్తే 24గంటల్లో చర్యలు తీసుకున్నారు. హుజూరాబాద్‌లో చీకటి అధ్యాయానికి తెరలేపింది తెరాసనే. 2023 ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది భారతీయ జనతా పార్టీనే. -ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
ఇదీ చదవండి: Bhatti: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం..