సీఎం కేసీఅర్పై నమ్మకం ఉంచాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఓసీ కుల సంఘాల ప్రతినిధులను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి.. అగ్రకులాల పేదల రిజర్వేషన్ల అమలుకు జీవో విడుదల చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
రిజర్వేషన్ల కల్పనపై వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రాష్ట్ర ఓసీల మహా గర్జన సభ నిర్వహించారు. ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు అధ్వర్యంలో జరిగిన సభకు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓసీ సంఘాల నేతలు హజరయ్యారు.
అదే కేసీఆర్ లక్ష్యం..
అందరూ బాగుండాలి... అందులో మనముండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు. అగ్ర కులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా లేదని.. అవి యథావిధిగా ఉంటాయన్నారు. రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణ పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
లేకుంటే ఆందోళన చేస్తాం..
జాప్యం చేయకుండా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు అన్నారు. లేని పక్షంలో వేలాదిగా తరలి వెళ్లి ప్రగతి భవన్ ముందు పెద్ద ఎత్తున అందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఖరీదైన కార్లు, బైకులు కొనకుండానే నడిపేయండి..!