పట్టణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాలను శరవేగంగా సాధించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డా.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కుడా కార్యాలయంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతిలతో కలసి పలు ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రతి నెల రూ 7.33 కోట్ల నిధులను మంజూరు చేస్తొందని డా.సత్యనారాయణ అన్నారు. ఆ నిధులను వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి, స్మార్ట్ సిటీ, హరితహారం సహా పలు కార్యక్రమాలపై సమీక్షించి వేగంగా పని పూర్తి చేయాలని సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు.
వందశాతం జియో ట్యాగింగ్
వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ 80.16 కోట్ల నిధుల వ్యయంతో 295 అభివృద్ధి పనులు చేపట్టామని డా.సత్యనారాయణ అన్నారు. అందులో 107 పూర్తవ్వగా, 42 పురోగతిలో, మిగిలిన 146 పనులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. హరితహారాన్ని అత్యంత ప్రధానాంశంగా తీసుకోని నాటిన మొక్కలకు వంద శాతం జియో ట్యాగింగ్ చేయడంతో పాటు 85 శాతం బ్రతకేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'సీఐ మల్లేష్ గారూ.. ఇలాగేనా ప్రవర్తించేదీ..?'