Kothakonda Veerabhadraswamy Jathara : సంక్రాంతి పండుగ రోజుల్లో హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రుడి క్షేత్రం జాతరకొచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. భీమదేవరపల్లి మండలంలో కొలువైన ఆ ఆలయంలో.. భద్రకాళీ సమేతుడై స్వామివారు కొలువై ఉన్నారు. నెల రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు జాతర సందడిగా సాగుతుంది. మకర సంక్రాంతి రోజున భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన 60 మంది భక్తులు తయారు చేసిన రథాలతో ఊరేగింపు కోలాహలంగా సాగుతుంది.
సంక్రాంతి మరునాడైన కనుమ రోజు త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శివనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శివసత్తుల నృత్యాలు హోరెత్తాయి. ముఖ్యంగా ఇక్కడ గుమ్మడి కాయలపై దీపాలు వెలిగించి మొక్కులు చెల్లిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో గుమ్మడి కాయలపై దీపాలు వెలిగించి నెత్తిపై పెట్టుకొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఆలయం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతుంది.
Inavolu Mallanna Jathara: హనుమకొండ ఐనవోలు మల్లన్న జాతర.. ఆద్యంతం కోలాహలంగా సాగుతోంది. స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. సంక్రాంతి రోజు రాత్రి ప్రభబండ్ల ప్రదర్శన.. అద్యంతం సందడిగా సాగనుంది. ఐనవోలులో కొలువైన మల్లిఖార్జునస్వామి జాతర.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు సాగుతుంది. కండేలరాయుడిగా, మైలారదేవుడిగా పేరొందిన మల్లన్న.. భక్తుల చేత పూజలు అందుకుంటాడు. జాతర సందర్భంగా శివసత్తుల నృత్యాలు హోరెత్తాయి. బోనాలు సమర్పించి, పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి.. జాతర సందడి కనిపించలేదు. కానీ ఈసారి పెద్ద సంఖ్యలో మల్లన్న స్వామి జాతరకు భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు జాతరకు విచ్చేశారు. ఐనోవోలు ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, రవాణా సౌకర్యం మెరుగుపరుస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. సంక్రాంతి పండుగ రోజున రాత్రి జరిగే ప్రభ బండ్ల ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. రాత్రి బండ్లతో భక్తులు ఆలయ పరిసరాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుంచి మంగళహారతులతో భక్తులు స్వాగతం పలుకుతారు. భక్తులు వ్యయప్రయాసలు లెక్కచేయకుండా మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: