ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవటంతో రైతులు సంబరంగా సాగు పనులు మొదలుపెట్టారు. మంచి దిగుబడులు అందుతాయని ఆశపడ్డారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలు అన్నదాత ఆశలపై నీళ్లు చళ్లాయి. జిల్లాలోని వర్ధన్నపేటలో కోనారెడ్డి చెరువుకు గండి పడి సాగు భూములు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పొలాల్లో 5 అడుగుల మేర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయని , ముందునాటికి కూడా పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో సుమారు 97 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. ప్రధానంగా వరి, పత్తి, వేరుశనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి పంట నష్టం నమోదు జరుగుతుందని.. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. వరద నీటి ఉద్ధృతికి సాగు భూములు రాళ్లు తేలి సాగుకు పనికిరాకుండా పోయాయన్నారు. పల్లపు ప్రాంతం కావడంతో నీరు నిలిచి ఇసుక మేటలు వేసిందని.. ఈ పరిస్థితుల్లో ఉన్న కొద్ది పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.
నీటమునిగిన పొలాలు తేరుకోగానే తక్షణ చర్యలో భాగంగా రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులు పలు సూచనలు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల్లో తెగుళ్లు విజృంభించే ఆస్కారం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. వరిలో కాండం తొలుచుపురుగు, పత్తిలో వడలుతెగులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యూరియా, పొటాష్ ఎరువులు వాడటం వల్ల పంటలు బలం పుంజుకుంటాయని అధికారులు తెలియజేశారు.
వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తమకు అధిక వర్షాలు అపారనష్టాలను మిగిల్చాయని.. ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని సకాలంలో నష్టపరిహారం అందేలా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!