ఒకప్పుడు బిల్లుల చెల్లింపు అంటే పెద్ద ప్రయాసే. సిబ్బంది ఇచ్చిన చీటీలను పట్టుకుని కౌంటర్లు, మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లి క్యూలైన్లో నిల్చోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్పీడీసీఎల్ ఆన్‌లైన్ సేవలను పెంచింది. ప్రత్యేక యాప్ రూపొందించింది. బిల్‌డెస్క్, టీఎస్‌ఆన్‌లైన్, పేటీఎం, టీ-వాలెట్, ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి అనేక వాలెట్ల ద్వారా వెసులుబాటు కలుగుతోంది.
ఇన్ని రకాలు వచ్చినా నేరుగా బిల్లులు చెల్లించే వారు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. ఇందులో కొందరికి ఆన్‌లైన్ విధానంపై అవగాహన లేకపోవడం, మరికొందరు సాంకేతిక సమస్యలు వస్తాయనే సందేహంతో సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 1,38,684 మంది ఆన్‌లైన్‌లో బిల్లులు కట్టారు.
26వేల మంది..
ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే వారి సంఖ్య ఆరు జిల్లాల్లో 26వేలకు పైగా ఉంది. లాక్‌డౌన్ వల్ల విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి మార్చి మీటర్ రీడింగ్ తీసుకోలేదు. అందుకే గత మార్చి బిల్లు ఎంత చెల్లిస్తే అంతే ఇప్పుడు చెల్లించాలని నిర్ణయించింది. పలువురు దీనిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అధికంగా వినియోగించామని, ఈ ఏడాది అంతలా వాడనప్పుడు ఎక్కువ కట్టాల్సి వస్తోందని అంటున్నారు. ఈ అంశంపై సీఎండీ గోపాల్‌రావు స్పష్టతనిచ్చారు.
కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరైనా ఎక్కువ చెల్లిస్తే ఆ మొత్తం తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పారు. త్వరలో మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లో తీసుకొచ్చేందుకు సైతం ఎన్పీడీసీఎల్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగరంలో ‘స్కాడా’ ద్వారా విద్యుత్తు నియంత్రణను కూర్చున్న చోటు నుంచే చేపడుతోంది. త్వరలో మీటర్ రీడింగ్‌నూ యాప్ ద్వారా చేపట్టేందుకు యాప్‌ను రూపొందిస్తోంది. దీనివల్ల వినియోదారులు తమ మొబైల్ ఫోన్‌తో మీటర్‌ను ఫొటో తీసి బిల్లులు తెలుసుకొనే అవకాశం ఉంది.