రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు కరోనాకు చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆరోపించారు. కొవిడ్ చికిత్సను వెెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేసులు ఇదే రీతిలో పెరిగితే పేదల జీవితాలు మరింత భారమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం.. రైల్వే ఇతర సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 20 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు.