వచ్చేవాళ్లు లేరు... తినేవాళ్లు లేరు. కనీసం ఛాయ్ అడిగేవాళ్లూ గగనమే అయ్యారు. హోటళ్లు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. ఛాయ్ దుకాణాల వాళ్లు... రెస్టారెంట్లు.. ఇలా ఆహారానికి సంబంధించిన రంగాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఎన్నో ఆశలతో వ్యాపారాలు ప్రారంభించిన వాళ్లు... పూర్తిగా డీలా పడిపోతున్నారు. కరోనా భయంతో పట్టణాలు, నగరాల్లో హోటళ్లవైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదని యజమానులు వాపోతున్నారు. ఇంతకన్నా లాక్‌డౌన్ సమయంలోనే నయం అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అద్దెలు, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు.
వరంగల్ , హన్మకొండ, కాజీపేటలో ప్రధాన రహదారి వెంట ఎన్నో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. ఉదయం నుంచి రాతి వరకూ ఇక్కడ నిత్యం రద్దీ ఉండేది. చారిత్రక నగరి కావడంతో పర్యాటకులు భారీగా వచ్చేవారు. హోటల్ నిర్వాహకులు క్షణం తీరిక లేకుండా గడిపేవాళ్లు. కానీ...కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. పర్యాటక ప్రదేశాలకు వచ్చేవాళ్లు లేరు. ఇతర పనులపై నగరానికి ఎవరైనా వచ్చినా... హోటల్ ముఖం చూడటం లేదు. స్థానికులు బయట ఫలహారాలు, భోజనాలు అంటేనే జంకుతున్నారు. శని, ఆదివారాలు.. వారాంతపు సెలవుల్లో సరదాగా గడిపేవాళ్లూ... రెస్టారెంట్ పేరెత్తడం లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
అద్దెలు భారంగా మారడం... పనివాళ్లకు జీతాలివ్వడం... తదితర కారణాలతో అనేక మంది హోటల్ వ్యాపారాలు మూసేస్తున్నారు. ఇలాగైనా కొంతమేర ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ఇక తమ పరిస్థితి మరీ దయనీయంగా ఉందంటున్నారు ఛాయ్ వాలాలు. ఇంతకన్నా కూలీ పనులకు వెళ్లడం మంచిదని అంటున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యి... మళ్లీ పూర్వపు స్థితి వస్తే తప్ప హోటల్ రంగం నిలబడదని నిట్టూరుస్తున్నారు.