వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మణిక్యపూర్ గ్రామంలో కావేరి విత్తన సంస్థ తమకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. కంపెనీ మాటలు నమ్మి ఆడ, మగ పేరుతో విత్తనాలు కొనుగోలు చేసి.. సాగు చేశామని రైతన్నలు తెలిపారు. మూడు నెలలు దాటిన పంట చేతికి రాకపోవడంతో కర్షకులు ఆందోళనకు దిగారు. గ్రామంలో దాదాపు 50 మంది రైతులు 70 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి పెట్టామని రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ముల్కనూర్ - హుజురాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
గతంలో వేసిన పంట నష్టం రాగా.. ఈ సారి నకిలీ విత్తనాలతో మోసపోయామని కృష్ణమూర్తి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సలహాలతో మొత్తం రూ.40 వేలు ఖర్చు పెట్టానని, కౌలు కింద యజమానికి రూ.40 వేలు చెల్లించామని వెల్లడించారు. పంట చేతికి రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశానని మరో రైతు వాపోయారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మాకు చావే శరణ్యమంటున్నారు అన్నదాతలు.
ఫోన్ చేసినా స్పందించడం లేదు :
కౌలు రైతుల ఆందోళనతో కంపెనీ యాజమాన్యానికి, మేనేజర్‌కు రెండు సార్లు ఫోన్ చేయగా స్పందించడం లేదని తెలిపారు. ఈ రోజు మండల వ్యవసాయ అధికారిణి నష్టపోయిన పంటను పరిశీలించారు. రైతులు పంట నష్టపోయిన వివరాలను సేకరించి ఉన్నత అధికారులకు సిఫార్సు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు అమ్మి మోసగించిన కావేరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమకు సత్వరమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.