Congress MLA Tickets War in Warangal : కాంగ్రెస్ రెండో జాబితా వెల్లడితో బరిలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఓరుగల్లు జిల్లాలో టికెట్ కోసం ఎదురుచూసిన ఆశావహుల్లో కొందరిని అదృష్టం వరించగా.. మరికొందరిని దురదృష్టం వెంటాడింది. ఆ పార్టీ నుంచి చివరి నిమిషంలో ఈ పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ రాగా.. అమెరికాలో ఉండి మరో అభ్యర్థి టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సీటు పొందిన వారు సేవ చేస్తామని చెబుతుండగా.. అవకాశం రాని వారు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.
Warangal Congress MLA Tickets War : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాయని రాజేందర్‌రెడ్డి, జంగారాఘవరెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆఖరి నిమిషంలో డీసీసీ అధ్యక్షుడు నాయనికే అదృష్టం దక్కింది. టికెట్ వచ్చిన సంతోషంలో నాయని వర్గీయులు ఉండగా జంగా అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. 2004 నుంచి టికెట్ వస్తుందని చివరి నిమిషం వరకు చూసి ఉసూరుమనడం నాయని రాజేందర్‌రెడ్డికి పరిపాటిగా మారింది. 2018లో టీడీపీ పొత్తుతో పేరు గల్లంతుకాగా.. ఈసారి మాత్రం నాయని కల నెరివేరినట్లైంది. వరంగల్ పశ్చిమ స్థానంపై గంపెడాశతో ప్రచారపర్వంలో దూసుకెళుతున్న జంగారాఘవరెడ్డి దారి ఎటు అన్నది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణపై రాంపూర్‌లో ముఖ్య కార్యక్తరలతో జంగా సమాలోచనలు జరుపుతున్నారు.
Congress MLA Candidates List 2023 : జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్(Telangana Congress)నుంచి మామిడాల యశస్విని బరిలో దిగనున్నారు. యశస్విని తొలిసారిగా పోటీచేస్తూ.. రాజకీయ ఉద్దండుడిగా ఉన్న మంత్రి ఎర్రెబెల్లి దయాకరరావును ఢీ కొంటున్నారు. ఆ టికెట్‌ను ఎన్ఆఐ ఝాన్సీరెడ్డి ఆశించారు. ఎన్నికల షెడ్యూల్ వెలవడకముందునుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించినా.. భారత పౌరసత్వం లభించలేదు. తనకు కాకున్నా కోడలు యశస్వినిరెడ్డికి ఇవ్వాలని అధిష్ఠానంముందు ప్రతిపాదించగా.. అందుకు దిల్లీ పెద్దల అంగీకారంతో అమెరికాలో ఉన్న యశస్వినిరెడ్డికి పాలకుర్తి టికెట్ వరించింది. 26 ఏళ్ల యశస్విని సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావును ఎదుర్కొవడం ఆసక్తికరంగా మారింది.
Congress Ticket War in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు దక్కించుకునేదెవరు..?
Telangana Congress MLA Candidates 2023 : ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతోంది. గత ఎన్నికల్లో పరకాలలో పోటీ చేసి ఓడిపోయారు. సురేఖ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను సురేఖ ఢీ కొంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీలో ఉన్నందున త్రిముఖపోరు ఉంటుందని భావిస్తున్నారు
Congress Tickets War in Telangana : వర్ధన్నపేట అభ్యర్థిగా అంతా ఊహించినట్లుగానే విశ్రాంత ఐపీఎస్ అధికారి నాగరాజు కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో దిగుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన నాగరాజు పదవీ విరమణ తర్వాత హస్తం పార్టీలో చేరారు. టికెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న నాగరాజు.. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు.
జనగామ నుంచి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికే టికెట్ దక్కింది. సీనియర్ నేత, మాజీ మంత్రి, పూర్వ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య.. గులాబీ పార్టీలో చేరికతో కొమ్మూరికి లైన్ క్లియర్ అయింది. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారిగా డాక్టర్ మురళీనాయక్ పోటీలో దిగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మరోనేత బెల్లయ్య నాయక్.. టికెట్ ఆశించగా అధిష్ఠానం మాత్రం మురళీనాయక్ వైపే మొగ్గు చూపింది. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చేరిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఇనగాల వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు టిక్కెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్ రెండు జాబితాల్లో 11 మంది అభ్యర్థులను ప్రకటించగా.. డోర్నకల్ స్థానానికి మాత్రం పెండింగ్‌లో ఉంచింది.