వరంగల్ పట్టణ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 32వ డివిజన్ తీగల గుట్ట రైల్వే గేట్ ప్రాంతంలో తెరాస ఎన్నారై సెల్ సౌతాఫ్రికా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మల్యే దాస్యం వినయ్ భాస్కర్ పేదలకు దుప్పట్లు పంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని.. సకాలంలో స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకాలంలో స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. కరోనా వైరస్, వరుస వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తమవంతు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెరాస ఎన్నారై సెల్ సౌతాఫ్రికా విభాగం బాధ్యులు వీరన్న తెలిపారు.
అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో వినయ్ భాస్కర్ పర్యటించారు. పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంభాలను వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 49వ డివిజన్లో పరిధిలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. మొన్నటి భారీ వర్షాలకు నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించాలని సూచించారు. కార్పోరేటర్లు, వార్డుల్లో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం పట్టణాల పరిశుభ్రతకు ప్రత్యేకంగా మిషన్ మోడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మాడిశెట్టి అరుణ శివశంకర్, కేశబోయిన అరుణ, తెరాస డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ