Warangal On Flood Damage Survy On Central team : ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాను అతాలకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందం వరంగల్ వచ్చింది. ఐదుగురు సభ్యుల గల ఈ కేంద్ర బృందం.. మూడు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారు. ముందుగా హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను బృందం తిలకించింది.
గత వారంలో హనుమకొండ, వరంగల్‌లో కురిసిన కుండపోత వానలు, వరదల కారణంగా జలమయమైన కాలనీలు, కూలిన ఇళ్లు, పంట నష్టం, దెబ్బతిన్న రహదారుల వివరాలను అధికారులు వివరించారు. అలాగే సర్వం కోల్పోయిన బాధితులకు సంబంధించి పూర్తి వివరాలను రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ కేంద్ర బృందానికి తెలియచేశారు. అనతంరం హనుమకొండలోని జవహార్ నగర్‌తో పాటు నయింనగర్ ముంపు ప్రాంతాలను సందర్శించారు. వరంగల్ జిల్లాలోని ఎన్‌ఎన్ నగర్‌తో పాటు బొంది వాగు, దెబ్బతిన్న భద్రకాళీ చెరువు కట్ట ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది.
బుధవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి వరదల కారణంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శిస్తారు. బాధితులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకుంటారు. అలాగే ములుగు జిల్లాలో ఈ బృందం పర్యటించనుంది. వరదల కారణంగా 8 మందిని కోల్పోయిన ఏటూరినాగారం మండలం కొండాయ్ గ్రామాన్ని బృందం సందర్శిస్తుంది. రెండు రోజుల వరంగల్ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం భద్రాచలం వెళ్లి అక్కడ వరంద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి దిల్లీ బయళ్దేరనున్నారు.
ఇంకా తేరుకోని ముంపు గ్రామాలు: మరోవైపు భారీ వరదల కారణంగా నీట మునిగిన గ్రామాల పరిస్థితి దయానీయ స్థితిలో కనిపిస్తున్నాయి. అయిన వారిని వరదల్లో పొగొట్టుకొని.. కనీసం నిత్యావసర సరుకులు లేక ప్రజలు నానవస్థలు పడుతున్నారు. సహాయం కోసం వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. పెంచుకున్న పాడి పశువులు నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో మరి కొందరి ఇళ్లు నేలమట్టం కావడంతో గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటపొలాల్లో ఇసుక మేట వేయడంతో ఈ ఏడాది పంట వేయడానికి అవకాశం లేకుండపోయిందని కన్నీటి పర్యాంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: