మాతృభాషలో బోధిస్తే పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. సైన్సు పాఠాలను సైతం మాతృభాషలో నేర్చుకుంటే ఎన్నో ఫలితాలు ఉంటాయి. పెద్దయ్యాక దానిపై పట్టు సాధించి పరిశోధనలవైపు ఆసక్తి చూపే అవకాశం ఉంది. అందుకే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం చిన్నారులకు మాతృభాషలోనే సైన్సును భోధించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.
స్కోప్ ప్రాజెక్టుకు వరంగల్ నిట్ ఎంపిక
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మాతృభాషలో శాస్త్ర సాంకేతికత అంశాలను బోధించేందుకు సైన్స్ కమ్యూనికేషన్- పాపులరైజేషన్ అండ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు(SCOPE)కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థులకు తెలుగులో సైన్స్‌ను బోధించేందుకు వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థకు(Warangal nit) స్కోప్ ప్రాజెక్టు మంజూరైంది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.20 లక్షల నిధులు అందుతాయి. ఈ ప్రాజెక్టు కోర్ కమిటీ ఛైర్మన్‌గా వరంగల్ నిట్ సంచాలకులు వ్యవహరించనున్నారు.
సైన్స్ వ్యాసాలు తెలుగులోకి అనువాదం
మూడేళ్ల పాటు శాస్త్ర విజ్ఞాన విషయాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది విద్యార్థులకు తెలుగులో చేరువ చేసేందుకు కృషి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలుగు భాషలో వివరించేందుకు ఆగస్టు నెలలో ఒక మ్యాగజైన్‌ను కూడా ప్రారంభించారు. నిపుణులు రాసిన సైన్స్ వ్యాసాలను తెలుగులోకి అనువదించి విద్యార్థులకు అందించనున్నారు. ప్రతి వారం జూమ్ ద్వారా వెబినార్ ఏర్పాటు చేసి... భాషపై మంచి పట్టున్న వారితో ఉపన్యాసాలను ఇప్పించనున్నారు. స్కోప్ ప్రాజెక్టు ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రారంభం కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే ప్రారంభమైంది.
ఇదీ చదవండి: DH: కొవిడ్, సీజనల్ వ్యాధుల లక్షణాలుంటే బడికి పంపొద్దు: డీహెచ్