హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని సీఎం జిల్లాల పర్యటనలు చేస్తున్నారని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనను అడ్డుకోబోమని స్పష్టం చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో మాట్లాడారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికయ్యే ఖర్చు అందుకు నిధులను ఎలా సమకూర్చారో.. మీ ప్రణాళికలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు
కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం చెప్పాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి తన స్థాయిని మరిచి భాజపాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజమే కానీ.. అవీ సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్, ఆక్సిజన్ అందిచడంలో విఫలమైందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్‌ను ఎందుకు రాష్ట్రంలో అమలు చేయలేదని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చూడండి: కాళేశ్వర ఫలితం.. నిండుకుండలా ప్రాజెక్టులు