వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో 30 పడకలను, అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని సందర్శించి వసతులను పరిశీలించారు.
దివంగత పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నపుడు తన స్వగ్రామమైన వంగరలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారని భాజపా మండల అధ్యక్షుడు పృథ్విరాజ్ గుర్తుచేశారు. ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి అభివృద్ధిని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.
"స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి 5 రోజుల్లో ఆసుపత్రికి అంబులెన్స్‌ను కేటాయించాలి. లేకుంటే భీమదేవరపల్లి మండల భాజపా పక్షాన గ్రామ గ్రామాన తిరిగి భిక్షాటన చేసి అంబులెన్సును ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలను కాపాడతాం. ఆసుపత్రి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. కాలం చెల్లిన ఔషధాలను ఆసుపత్రిలోనే కాల్చి వేస్తున్నారు. దీని వల్ల ఏర్పడిన విష వాయువులతో కొత్త రోగాలు వస్తున్నాయి."
-పృథ్వీరాజ్, భాజపా మండల అధ్యక్షుడు
వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలను పరిశీలిస్తున్న నాయకులు
ఇదీ చూడండి: ఆర్డరివ్వండి... పోస్టులో ప్రసాదం మీ ఇంటికొస్తుంది..