హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార తెరాస గుండాగిరీ చేస్తోందని భాజపా నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజురాబాద్ నుంచే మొదలవుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టే ప్రజా దీవెన యాత్ర బత్తినివానిపల్లె నుంచి ప్రారంభించారు. పాదయాత్రకు కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల ఆరోపించారు.
సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు
భాజపా నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర ప్రారంభమయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఈటల ఆయన సతీమణి జమునాతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. జానపద నృత్యాలు, కులవృత్తుల జీవనవిధానాలను ప్రతిబింబించేలా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సాగిన పాదయాత్రలో దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ రావు, భాజపా సీనియర్ నాయకులు వివేక్, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మేల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులను నేరుగా కలుసుకున్న ఈటల... పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిదేనని తెలిపారు. కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించిన ఆయన... ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
నియంతృత్వ పాలనకు చరమగీతం
ప్రజా దీవెన యాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలి. మేం ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజూరాబాద్ నుంచే మొదలవుతుంది.
- ఈటల రాజేందర్, భాజపా నాయకుడు
పాదయాత్ర ప్రారంభానికి ముందు హుజురాబాద్‌లోని ఈటల నివాసంలో... ఆయన సతీమణి జమున, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు.
ఇదీ చదవండి: నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం