BJP Arrangements For PM Modi Meeting In Warangal : ఓరుగల్లులో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనసమీకరణకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంచార్జీని నియమించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాలకు ఇద్దరికి బాధ్యతలు అప్పగించింది. కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి జనసమీకరణకు సంబంధించిన సమీక్షా సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలను ఆదేశించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు.. ఈనెల 8న రాష్ట్రానికి రానున్నారు. కాజీపేటలో వాగన్ ఓవర్ హాలింగ్, టెక్స్‌టైల్ పార్క్, జాతీయరహదారులకి శంకుస్థాపన చేయనున్నారు. అధికార కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ సభకు ప్రధాని మోదీ.. హాజరై ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ హాజరయ్యే సభను.. రాష్ట్రనాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారీగా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనసమీకరణకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి.. ఒక బాధ్యుడిని రాష్ట్ర బీజేపీ నియమించింది.
BJP Mobilizing People For PM Modi Meeting : వరంగల్ దగ్గరగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు.. ఇద్దరు చొప్పున బాధ్యులను కేటాయించింది. పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దన్న నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు హెచ్చరికలు పంపారు. సమస్యలుంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికీ తేవాలి తప్పితే.. పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ పని చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.
మోదీ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది : కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీలో నెలకొన్న కల్లోలం.. పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి గురి చేసింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు విశ్వసిస్తున్న సమయంలో.. ఆఫ్ ద రికార్డుల పేరిట నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ సభతో.. నిరాశలో ఉన్న పార్టీశ్రేణుల్లో కొత్తఉత్తేజాన్ని నింపుతుందని కమలనాథులు భావిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సభకావడంతో విజయవంతం చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి :