కేంద్ర ప్రభుత్వం వరంగల్‌కు హృదయ్ పథకం జాబితాలోకి చేరుస్తూ 35 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. భద్రకాళీ బండ్‌తో పాటు ఖిల్లా వరంగల్, వెయ్యి స్తంభాల ఆలయం, పద్మాక్షి గుట్ట జై మందిర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. పనులు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కూడా) ఆధ్వర్యంలో జరిగాయి. హృదయ్ నిధుల నుంచి రూ.25 కోట్లు భద్రకాళి బండ్ అభివృద్ధికి కేటాయించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో వరంగల్ నగరానికి భద్రకాళి బండ్ నూతనంగా పర్యాటక ఆకర్షణగా నిలవనుంది.
దారి పొడవునా రాతి స్తంభాలు
భద్రకాళీ చెరువును చూస్తూ బండ్‌పై కూర్చునేందుకు కుర్చీలు, వాటర్ ఫౌంటైన్, వ్యాయామశాల, చిన్న చిన్న రోడ్లను అభివృద్ధి చేశారు. పెద్దల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా నడక దారికి నూతనంగా సింథటిక్ ట్రాక్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. 1.5 కిలోమీటర్ల మేర దారి పొడవునా రాతి స్తంభాలు వివిధ కళాకృతులను చూపరులను ఆకర్షిస్తాయి.
రాష్ట్రంలోనే తొలిసారిగా..
రాత్రి వేళలో చెరువు మధ్యలో ఏర్పాటుచేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు నగరవాసులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా నడక దారిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి దీపాలతో పాటు అమ్యూజ్ మెంట్ పార్కులు అదనపు ఆకర్షణగా నిలిచాయి. బండ్ అభివృద్ధిలో భాగంగా (కూడా) కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చెరువు చుట్టూ లక్ష మొక్కలు నాటేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పక్షులకూ నిలయంగా !
రకరకాల మొక్కలతో భద్రకాళి బండ్ పరిసరాలన్నీ ఆకుపచ్చగా కనువిందు చేస్తున్నాయి. అనేక జాతుల పక్షులకు నిలయంగానూ మారనుంది. బండ్ అభివృద్ధిలో భాగంగా 240 రాతి స్తంభాలనుస, 1500 విద్యుద్దీపాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు మెుక్కలను ఏర్పాటు చేశారు. నూతనంగా ముస్తాబైన భద్రకాళి బండ్ అందాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు.