వరంగల్లో బతుకమ్మ వేడుకలు అదరహో అనిపించేలా ఆద్యంతం కనువిందుగా సాగాయి. ఉదయం నుంచి పూల సేకరణలో నిమగ్నమైన మహిళలు... అందంగా ఏర్చి కూర్చిన బతుకమ్మలను నెత్తిన పెట్టుకుని వేయి స్తంభాల గుడి బాట పట్టారు. ఉదయం ఆరు నుంచే గుడి పరిసరాలన్నీ యువతులు, మహిళలు, చిన్నారులతో కిక్కిరిసిపోయాయి.
మహిళలు సంప్రదాయబద్ధంగా తయారై... బతుకమ్మలతో ఆలయానికి తరలి వచ్చారు. బతుకమ్మలను ఒక్క చోట పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. చిన్నా పెద్ద భేదాభిప్రాయాలు మరచి బతుకమ్మ చుట్టూ ఆడి పాడారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది పండుగ బాగా జరిగిందని మహిళలు తెలిపారు.
పండుగను జరుపుకునేందుకు సింగపూర్ నుంచి వచ్చామని... ఇక్కడ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచి ఈ సంబురాలు మరింత శోభను సంతరించుకుంటున్నాయని వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు