Bail Granted to Saif in Preethi suicide case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌కు.. బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం సహ వరంగల్ జిల్లా రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సైఫ్ దాఖలు చేసుకున్న మూడు బేయిల్ దరఖాస్తులను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా రూ.10 వేల సొంత పూచీ కత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తును.. కోర్టుకు సమర్పించాలని బేయిల్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
PG Medico Preethi Suicide Case : ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య, 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని నిర్దేశించారు. సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయవద్దని, మృతురాలి కుటుంబ సభ్యలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి నిబంధనలు విధించారు. న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే అతని బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు.
సాంకేతిక కారణాల వల్ల జైలు నుంచి సైఫ్ విడుదల వాయిదా: అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కాలేదు. ఆయన గత కొంత కాలంగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆయన్ను ఈరోజు ఖమ్మం జైలు నుంచి వరంగల్ కోర్టుకు తరలించారు. ఈరోజు వాయిదా ఉండటంతో కోర్టు ఎదుట హాజరు పరిచేందుకు తీసుకువెళ్లినట్లు తెలుస్తొంది. రేపు బెయిల్ పేపర్లు అందిన వెంటనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రీతి ఆత్మహత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రీతిని హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని.. హత్య చేసినట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదని సీపీ రంగనాథ్ గత నెలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విధితమే. ప్రీతిని సైఫ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపించారు.
ఇవీ చదవండి: