రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపరచటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వరంగల్‌లోని కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించింది. ఆస్పత్రిలో 250 పడకలు ఏర్పాటు చేశారు. ఐసీయూలోనే 50 పడకలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విభాగాల్లో 8 అధునాతన ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు.
ఏడాదైనా...
ఆస్పత్రి నిర్మాణం పూర్తై ఏడాది గడుస్తున్నా... ప్రారంభానికి నోచుకోవట్లేదు. సరైన నిర్వహణ లేకపోవడంతో కోట్ల విలువ చేసే పరికరాలు నిరుపయోగంగా మారి దుమ్ముపడుతున్నాయి. ఆస్పత్రి నడవకున్నా... ఏసీల వినియోగంతో నెలకు రూ. 7 లక్షల విద్యుత్ బిల్లులు వస్తోంది.
రూ. 150 కోట్ల వ్యయం...
2015 సంవత్సరంలో పీఎంఎస్ఎస్వై పథకం కింద వరంగల్‌కు ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశారు. సుమారు రూ. 150 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం వాటా రూ. 120 కోట్లు కాగా రూ. 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం రాష్ట్ర పరిధిలోకే వస్తుంది.
గతేడాది మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రత్యేక చొరవతో రూ. 12 కోట్ల నిధులు విడుదల చేయించారు. మిగిలిన నిధుల జాప్యంతోపాటు వైద్యుల నియామకం చేపట్టకపోవడంతో ఆస్పత్రి ప్రారంభం ఆలస్యం జరుగుతోంది.
కొవిడ్ సమయంలో...
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కొవిడ్ రోగులకు ఆస్పత్రిలో పడకలు కేటాయించి వైద్యసేవలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కాలయాపన జరిగింది తప్ప ఆస్పత్రిలో సేవలు మెుదలు కాలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనైనా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన మేరకు నిధులు కేటాయించి సిబ్బంది నియామకం త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: సాగర్ ఉపఎన్నికలో గెలుపు మాదే: బండి సంజయ్