Aler Protest: మహబూబాబాద్ జిల్లా ఆలేరు(Aleru)లో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబానికి న్యాయం చేయాలని వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో ప్రగతిశీల మహిళా సంఘం, న్యూడెమోక్రసీ, సీపీఐ, భాజపా, తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వామపక్షాలు రాస్తారోకో చేశారు.
అంబులెన్స్ అడ్డగింత...
పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా నిరసనకారులు అడ్డుకున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కదలనివ్వమని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
వాదోపవాదాలు...
ఈ నిరసనలో ప్రగతిశీల మహిళా సంఘం, న్యూడెమోక్రసీ, సీపీఐ, భాజపా, తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి. యువతి ఆత్మహత్యపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు.. పోలీసులు కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని భాజపా విమర్శించింది. నిందితుల్లో ఒకరైన ఎంపీటీసీ భర్త కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడని.. యువతి ఆత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెరాస వాదిస్తోంది.
నిందితుల అరెస్ట్...
యువతి మృతికి కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లికుదురు మండలం ఆలేరులో ఈనెల 18న పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ ఈనెల 22న మృతిచెందిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అమ్మాయిపై అత్యాచారం చేస్తే... మనస్తాపానికి గురై మరణ వాంగ్మూలం రాసి దోషులను చెప్పుతో కొట్టాలని రాసి పెట్టింది. అంటే అమ్మాయి ఎంత వేదన చెందిందో స్థానికులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ఆడవాళ్లు రోడ్డుపై తిరగలేని విధంగా ప్రభుత్వం చేసింది. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యే. నిందితులను కఠినంగా శిక్షించాలి.
--- విపక్ష నేతలు
ఇదీ చూడండి: 'వాళ్లు ఆగం చేశారు.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను'