ACB Officers Rides In Warangal : మంచి జీతం ఉన్నా కొందరు ప్రభుత్వం అధికారులు అడ్డదారులు తొక్కతున్నారు. లంచాలకి అలవాటు పడి సామాన్యులను జలగల్లా పీడిస్తూ అనిశా అధికారులకి చిక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఐదేళ్లలో 36 మంది అధికారులు లంచం తీసుకుంటూ దొరికి పోగా గతేడాది 11 మంది చిక్కారు. అనిశా దాడులు విస్తృతం చేస్తున్నా ఏటేటా కేసులు పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నా కళ్లు గప్పి కింది స్ధాయి సిబ్బంది ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
KU Assistant Registrar Kishtaiah Caught By ACB Taking Bribe : పాత బిల్లుల ఆమోదానికి పాల సరఫరాదారుడు నుంచి 50 వేలు లంచం తీసుకుంటూ కాకతీయ విశ్వవిద్యాలయ సహాయ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహాలకి పాలు, పెరుగు సరఫరాకి కాశీబుగ్గకి చెందిన వ్యాపారి రెండేళ్లకి టెండర్ దక్కించుకున్నాడు. దాదాపు 9 లక్షల మేర బిల్లులు బకాయి ఉండడంతో వాటి ఆమోదానికి సహాయ రిజిస్ట్రార్ 75 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు 50వేలిస్తే బకాయిపడ్డ బిల్లులు ఆమోదిస్తానని చెప్పగా బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పక్కాగా పట్టుకున్నారు.
50 వేలు ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఏసీబీకి ఫిర్యాదు : 50 వేలు లంచం తీసుకుంటూ జనగామ జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి ప్రశాంత్, అతని సహాయకుడు అజర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓబుల్ కేశవాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న ఫార్మసిస్ట్ స్రవంత రఘునాథపల్లి ఆరోగ్య కేంద్రంలో సర్దుబాటు చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్ పెండింగ్ వేతనాల బిల్లులను పాస్ చేసేందుకు డిఎమ్హెచ్ఓ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. 50 వేలు ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో బాధితురాలు ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి తెలియజేయాలి : డిఎమ్హెచ్ఓ కార్యాలయంలో అజార్ ద్వారా మరో 50 వేలు లంచం తీసుకుంటుండగా వారిని ఏసీబీ పట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినా సంప్రదించాలన్న ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన వారి వివరాలు తెలియ చేయవచ్చని సూచిస్తున్నారు. అవివీతి పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
"ఆదాయానికి మించిన ఆస్తుల కేసును మేం స్వీకరిస్తాం. ఈ కేసులో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు ఎట్టి పరిస్థితిల్లో బయట పెట్టాం. బాధితుడే స్వయంగా ఫిర్యాదు చేయాలి, వచ్చిన ఫిర్యాదును బట్టి నేరం మోపబడిన వారిని విచారిస్తాం. అనిశా టోల్‌ఫ్రీ నం 1064కు ఫిర్యాదు చేయాలి. ప్రత్యక్షంగా వచ్చి కలిసి ఫిర్యాదును స్వీకరిస్తాం."-సాంబయ్య, ఏసీబీ వరంగల్ రీజియన్ డీఎస్పీ