Shakunthala: ఆరోగ్యమే మహాభాగ్యం. రోజంతా హుషారుగా ఉండాలంటే... వ్యాయామం చేయాల్సిందే. రోజులో కాసేపు సైకిల్ తొక్కినా ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సైకిల్ రైడ్‌పై అవగాహన కల్పించేందుకు... అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో ఎక్కువ శాతం మంది యువతీయువకులే పాల్గొంటున్నారు. హనుమకొండలోని న్యూ శాయంపేటకు చెందిన శకుంతలకు సైకిల్ సవారీ అంటే చాలా ఇష్టం. పట్టుదలతో సైకిల్ తొక్కడం నేర్చుకున్న ఆమె... ఆ తర్వాత ఎక్కడికెళ్లాలన్నా సైకిల్‌పైనే వెళ్తుంటారు. శకుంతల వయస్సు 60 సంవత్సరాలైనా... అలుపు, ఆయాసం లేకుండా కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కేస్తున్నారు. వరంగల్, కాజీపేట, హనుమకొండ తదితర ప్రాంతాలకూ సైకిల్‌పైనే వెళ్తుంటారు. 60ఏళ్ల వయసున్న శకుంతల మండుటెండలోనూ హుషారుగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు.
నేను ఎంతదూరమైన సైకిల్ మీదే పోతుంటా. అందరూ సైకిల్ నేర్పించమని అడుగుతుంటరు. నన్ను గ్రేట్ అని చెబుతుంటరు. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. సైకిల్ తొక్కకుంటే నాకు కాళ్ల నొప్పులు అనిపిస్తది. సైకిల్ తొక్కిన రోజు నాకు అలసట అనిపించదు. నాకు బీపీ, షుగర్ ఏమీ లేవు. - శకుంతల, హనుమకొండ
శకుంతలది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భర్త ఓ చిరుద్యోగి. ఇద్దరు ఆడపిల్లలకూ కష్టపడి పెళ్లిళ్లూ చేశారు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు... వివాహాల్లో పిండివంటలు చేస్తూ జీవితం గడుపుతున్నారు. ఆరుపదుల వయస్సులోనూ ఇంటి పని, వంటపని చేస్తూ... హుషారుగా ఉండేలా చేసింది సైకిలేనని... ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని శకుంతల చెబుతున్నారు. శకుంతల ప్రస్తుతం నడిపే సైకిల్ చాలా పాతబడిపోయింది. నడపడం కష్టంగా ఉంటున్నా... దానిని వదిలిపెట్టడంలేదు. కొత్త సైకిల్ కొనే స్థోమత లేదంటున్న ఆమె... దాతలెవరైనా కొత్త సైకిల్ కొనివ్వాలని కోరుతున్నారు.