విఘ్నాలను తొలగించి .. విజయాలను, సకల శుభాలను అందించే దేవుడు వినాయకుడు. భక్తిశ్రద్ధలతో ఓ గరిక సమర్పించినా... ఈ స్వామి మిక్కిలి సంతృప్తి చెందుతాడన్నది భక్తుల విశ్వాసం. గణపతి, గణనాథుడు, లంబోదరుడు, పార్వతీ తనయుడు, ఏకదంతుడు, వక్రతుండుడు... ఇలా ఎన్నో పేర్లు మరెన్నో రూపాలు. ఏ నామంతో పిలిచినా... ఏ రూపంలోనూ కొలిచినా భక్తులకు అభయమిచ్చే దేవుడు వినాయకుడు. తెల్లజిల్లేడు వృక్షమే వినాయకుడి సంపూర్ణ రూపంగా మారి... భక్తుల చేత పూజలందుకోవడం కాజీపేట వినాయక ఆలయ ప్రత్యేకత. అందుకే ఈ స్వామిని శ్వేతార్క మూల గణపతి అని పిలుస్తారు. వేకువజాము నుంచి రాత్రి వరకు స్వామి వారికి నిత్యపూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. తొలినాళ్లలో స్వామి నిజరూపానికే అభిషేకాలు జరిగినా... ఆ తర్వాత పద్దెనిమిదిన్నర కేజీల వెండికవచాన్ని ధరింపజేసి... పూజలు చేస్తున్నారు.
ఏటా వినాయక చవితికి ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వస్తాం. మేం కోరిన కోరికలు నెరవేరుతాయి. మళ్లీ వచ్చి ఆ మొక్కులను తీర్చుకుంటాం. ఈ ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంటుంది. గణపతి ఉత్సవాలు 16 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ గణపతిమాల ధారణ కూడా ఉంటుంది. స్వామివారి ఆలయం ఇక్కడ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
-స్థానికులు
భక్తులే దాతలు
భక్తులే దాతలుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడమూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందడంతో నగరం నలుమూలనుంచే కాదు... హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. నగరానికి వచ్చే సందర్శకులు... శ్వేతార్క గణపతిని దర్శించకుండా వెళ్లరంటే అతిశయోక్తికాదు. మంగళ, శని, ఆదివారాల్లోనూ సంకటహరచతుర్థి సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. నిత్యం పంచామృతాలతో అభిషేకాలు, వివిధ రకాల పూలు, పత్రులతో అలంకరణలు చేస్తారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. నవగ్రహాలకు దిశలను బట్టి విడివిడిగా ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. దోష నివారణ కోసం నిర్దిష్ట గ్రహానికే పూజ నిర్వహించే వీలు ఉంటుంది.
స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి. 16 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తాం. రోజుకొక విధంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. 350 కిలోలకు పైగా పసుపు తీసుకొని... పెద్ద గౌరమ్మగా చేసి పూజ చేస్తాం. లక్ష్మి కటాక్షం కలగాలని ఈ పూజలు జరుపుతాం. అనారోగ్య సమస్యల నివారణ కోసం రుషి పంచమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. గరిక, పూలతో ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
రాధాకృష్ణ, ఆలయ అర్చకులు
16 రోజుల ఉత్సవాలు
హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఈసారి కన్నుల పండువగా జరుగుతున్నాయి. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 12 రకాల అభిషేకాలతో ఆలయ అర్చకులు గణపతిని పూజించారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఆలయంలో 16 రోజుల పాటు జరిపే వేడుకలకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: CM KCR: కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న సీఎం కేసీఆర్