పండ్లంటే ఇష్టం లేనివారుంటారా..! అందులోనూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద రకాల పండ్లు ఒకే చోట దొరుకుతుంటే వెళ్లకుండా ఉండగలమా.. అసలు నమ్మగలమా.. నమ్మాలండి నమ్మక తప్పదు. ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడుండే తోటలో ఒక్క మామిడిలోనే 25 రకాల పండ్లున్నాయంటా. అంతేనా దేశవాళీయే కాక చెర్రీ, లిచీ మొదలైన విదేశీ జాతి పళ్లూ ఆ తోటలో విరగకాస్తున్నాయంట.
ప్రత్యేక అభిమానమే ప్రధాన కారణం...
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో వంద రకాల పండ్ల చెట్లున్న తోట ఉంది. గ్రామానికి చెందిన సింగారెడ్డి శౌరిరెడ్డికి మొక్కలపైన ఉన్న ప్రత్యేక అభిమానమే ఈ తోటను పెంచేందుకు కారణమైంది. ఉన్న అయిదెకరాల భూమిలో ఓ తోటను సాగు చేస్తున్నారు. ఏకంగా వంద రకాల పండ్లను పండిస్తున్నారు.
25 రకాల మమిడి, 9 రకాల సీతాఫలాలు...
మామిడి, సీతాఫలం, జామ లాంటి మన దేశవాళి పండ్లే కాకుండా... స్టార్ ప్రూట్, లిచీ, రాంబుటాన్, స్పెయిన్ ఆరెంజ్, నోని, అవకాడో, శాంటోల్, చెర్రీ, ఐస్ క్రీం బీన్, పిస్తా... ఇలా అనేక రకాల పండ్లను పండిస్తు ఔరా అనిపిస్తున్నారు. ఒక్కో చెట్టులో అనేక రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మామిడిలో 25, సీతా ఫలంలో 9 రకాల చెట్లూ... పండ్ల ప్రియులను వాహ్వా అనిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల మొక్కలూ... రుద్రాక్ష చెట్లను ఈ తోటోలో పెంచుతున్నారు.
సేంద్రియ పద్ధతిలో సాగు...
కొవిడ్ తర్వాత మార్కెట్లో పండ్లకు అమాంతం గిరాకీ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలన్నా... రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్న ఇప్పుడు ప్రతిఒక్కరి చూపు పండ్లవైపే. ఇంకా రసాయన ఎరువులు వాడని సేంద్రియ విధానంలో పండించిన పండ్లకు గిరాకీ మరీ ఎక్కువైపోతోంది. సింగారెడ్డి శౌరిరెడ్డి కూడా చెట్ల సాగుకు రసాయన ఎరువులు వాడకుండా... వాళ్లే తయారు చేసిన ఎరువును వాడుతున్నారు. సేంద్రియ పద్ధతిలోనే ఈ పండ్లను పండిస్తున్నారు.
అందమైన చెరువు. ఆ పక్కనే... పచ్చెని చెట్లు.. చెట్ల నిండా పండ్లతో కనిపించే ఈ తోటలో అడుపెట్టినవారెవరూ ఓ పట్టాన తిరిగి వెళ్లలేరంటే అతిశయోక్తి కాదు. అక్కడున్న అన్ని పండ్లను ఓ సారి రుచి చాడాల్సిందే అనిపిస్తుంది. వీలైనంత ఎక్కువ పండ్లను అక్కడే ఉండి తింటూ సేద తీరాలకునేవారూ చాలామందే ఉంటారండోయ్. అందులో మీరూ ఉన్నారా..!
ఇదీ చూడండి: successful farmer: 'నాది సేంద్రియ పంట.. నేను చెప్పిందే ధర'