ఏకధాటిగా కురుస్తున్న వాన రాష్ట్రాన్ని ముంచేస్తోంది. వాగులు ఉప్పొంగి.. రహదారులపైకి వరద నీరు చేరుతోంది. రోడ్లు కనిపించనంతగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఈ సమయంలో.. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లడం కష్టమే. ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్లడానికి ప్రయత్నించినా.. ఎటు నుంచి ఏ వరద వస్తుందో.. ఎక్కడ కొట్టుకుపోతామోనన్న భయం ప్రజల్లో నెలకొంది. అలాగని.. ఆస్పత్రికి వెళ్లకుండా ఉండలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితే వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏర్పడింది.
నర్సంపేట నుంచి నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి పాత మగ్ధుంపురం వద్ద ఉన్న లోలెవల్ వంతెన వద్ద వాగు ఉప్పొంగింది. వరద నీరంతా రహదారులపైకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. నెక్కొండ మండలం ముదిగొండ నుంచి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆమె కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నారు.
వారు ఆస్పత్రికి వెళ్లాలంటే వాగు దాటాలి. వారి ఇబ్బందిని గమనించిన స్థానిక యువకులు.. గర్భిణిని స్ట్రెచ్చర్‌పై మోసుకుని తీసుకెళ్లి వాగు దాటించారు. వాగు ఇవతల ఎదురుచూస్తున్న అంబులెన్స్‌లో ఎక్కించారు. అనంతరం ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గర్భిణికి సాయపడిన యువకులను స్థానికులు అభినందించారు.
" ప్రతి ఏడు వర్షాకాలమొస్తే ఇవే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాన పడితే వాగు దాటడం కష్టమవుతోంది. గతేడాది అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటుతూ కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మా గోడును అధికారులను ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మించాలి. మా ప్రాణాలు కాపాడాలి. "
- స్థానికులు
గర్భిణిని వాగు దాటించిన యువకులు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారు లేకపోతే ఆమె ప్రాణాలు దక్కకపోయేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని కోరారు.
- ఇదీ చదవండి : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి శిల్పా శెట్టి పోస్ట్