బావిలో మృతదేహాలు.. వీడుతున్న మిస్టరీ - గొర్రెకుంట ఘటన
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలోని పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు లభించిన కేసు ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతోంది. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో ఈ మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడుతున్నాయి.
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్లెకుంట గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో 9 మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి.. పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇవాళ ఉదయం అదనపు డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసులు, ఐబీ బృందం.. బావి పరిసర ప్రాంతాలను ముమ్మరంగా శోధించారు. మక్సూద్, బిహారీ యువకులు ఉంటున్న గదులను.. అక్కడి నుంచి బావికి ఉన్న దూరాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణులు రజామాలిక్ను తీసుకెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. బావిలోకి సైతం దిగి అణువణువూ శోధించారు.
ఎవరా మహిళ?
గొర్రెకుంట ప్రాంతం వద్ద మూడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇద్దరు బిహారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేసు పురోగతికి చెందిన కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. బిహార్‌కు చెందిన యువకుడి చరవాణి నుంచి ఒక మహిళకు ఫోన్ వెళ్లినట్లుగా ఉండటం వల్ల ఆమెనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో శవపరీక్ష నివేదిక కీలకం కానుంది.
ఆ రెండు నివేదికలు వస్తేనే...
నీట మునిగి చనిపోయి ఉంటారన్నది భావిస్తున్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఎఫ్ఎస్ఎల్, విసెరా నివేదికలు వచ్చేకే తుది నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. మృతదేహాలపై పెనుగులాట.. తీవ్రగాయాలు లేవని ఈడ్చుకొచ్చిన గాయాలు మాత్రం కనిపించాయని చెప్పారు. 10 నుంచి 14 రోజుల్లో పూర్తి నివేదికలు వస్తాయని ప్రకటించారు.
పోస్ట్ మార్టం పూర్తయిన మృతదేహాలు ఎంజీఎం మార్చురీకే పరిమితమయ్యాయి. షకీల్ మృతదేహం కోసం ఉదయం నుంచి భార్య ఎదురుచూపులు ఫలించలేదు. మరికొన్ని నమూనాలు సేకరించాల్సి ఉండడం వల్ల మార్చురీలోనే అన్ని మృతదేహాలను భద్రపరిచారు. పశ్చిమ్ బంగకు తీసుకువెళ్లేందుకు మక్సూద్ బంధువులు సముఖత చూపకపోవడం వల్ల షకీల్‌తో పాటుగా మిగిలిన మృతదేహాల ఖననం వరంగల్‌లోనే జరగనుంది.
సంబంధిత కథనం: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ