వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అతిక్రమించిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. 10 తర్వాత బయటకు వస్తే ఒళ్ళు వాచిపోయేలా కొడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... గడువు ముగియక ముందే పలుచోట్ల అత్యుత్సాహం చూపించారు కొందరు పోలీసులు. వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద ముజాహిద్ అనే వ్యక్తిపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. లాఠీలతో వాతలు వచ్చేలా కొట్టారు. పాల ప్యాకెట్ కోసం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు బయటకు వస్తే... పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని బాధితుడు వాపోయాడు.
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ వద్ద ఆసుపత్రికి వెళ్తున్న మరో వ్యక్తిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మినహాయింపు గడువు పూర్తికాక ముందే.. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. ప్రజలు విమర్శిస్తున్నారు. లాక్డౌన్ అమలు చేసేందుకు కఠినంగా ఉండటం సరైనదే అయినా... గడువు ముగియక ముందే ప్రజలపై లాఠీలతో విరుచుకుపడటం సహించరానిదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.