వరుసగా కురిసిన వానలతో ఓరుగల్లు నగరం వర్షపు నీటిలో చిక్కుకుపోయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని పలు కాలనీలు వరదనీటిలోనే ఉండిపోయాయి. నయీం నగర్‌లోని ప్రధాన రహదారిపై రెండు రోజుల నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది.
నాలాలు కుచించుకుపోవడం, వాటిపై అక్రమ నిర్మాణాల వల్ల వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. నాలాల పక్కన ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భద్రకాళి జలాశయంతోపాటు కట్టమల్లన్న చెరువు, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, కరీమాబాద్ రంగసముద్రం మత్తడి పోస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, సుందరయ్య నగర్, లోతుకుంట వీవర్స్ కాలనీ, శివనగర్, ఎస్ఆర్ నగర్‌లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో ముంపు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.
స్వచ్ఛందంగా ఖాళీ చేసి..
వరంగల్ మండిబజార్‌లో ఓ పాత భవనం కూలిపోయింది. పాత భవనాల్లో ఉండేవారు స్వచ్ఛందంగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. నీటమునిగిన కాలనీల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
హంటర్ రోడ్డులోని సాయి గణేష్ నగర్, కాపువాడ, హనుమకొండలోని అమరావతి నగర్‌వాసులను పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాండ్ బృందాలు వరంగల్‌కు వచ్చాయి. 3 బృందాలు సరిపోకపోతే మరింత మందిని పంపిస్తామని డీఆర్ఎఫ్ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు.
హంటర్‌రోడ్‌లోని బొందివాగులో ఫ్యూజ్ పెట్టెల వరకు వరద నీటిలో 13 ట్రాన్స్‌ఫార్మర్లు మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశామని నగర డీఈ జంపాల రాజం తెలిపారు. వరద నీరు తగ్గగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ సందర్శించారు. ఎస్ఆర్ఆర్ తోట, మధురా నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, వీవర్స్ కాలనీల్లో పర్యటించారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ప్రజలు కోరారు.
వాగులు ఉద్ధృతం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, బంధం వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసిన గూడూరు శివారులోని గోదాంలోకి వరద నీరు చేరింది.
ప్రవాహం తగ్గితే ఎంత నష్టం సంభవించిందో తెలిసే అవకాశం ఉంది. తొర్రూరు మండలం గుర్తూరులో ఆకేరు వాగు ఉద్ధృతితో... తొర్రూరు-నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పాకాల వాగులను గిరిజన శిశుసంక్షేశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో నిరాశ్రయులకు మంత్రి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పంట పొలాల్లోకి వర్షం నీరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు, పంట పొలాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ములుగు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకుతోపాటు చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలో కురుస్తున్న వానల వల్ల గోదావరి పొంగిపొర్లుతోంది. ఏటూరునాగారంలో ఓడగూడెం, నందమూరి కాలనీ, ఎస్సీ కాలనీలో వరద నీరు చేరుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే సీతక్క పరిస్థితులను పరిశీలించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కొత్తగూడ అడవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగ్గుల వాగు పొంగి పొర్లుతూ లక్నవరం సరస్సులో కలుస్తోంది. లక్నవరంలో రెండు ఉయ్యాల వంతెనలు నీట మునిగాయి. సరస్సు దీవుల్లో ఉన్న కాటేజీల్లోకి నీరు చేరింది. భారీగా వస్తున్న వరదతో లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది.
పలు కాలనీలు జలమయం
జనగామలో రంగప్ప చెరువు మత్తడి పోస్తుండడం వల్ల పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కూర్మవాడ, శ్రీనివాస్ నగర్, భవానీ నగర్ కాలనీలు నీటితో నిండిపోయాయి. ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు. చిట్టకోడూరు జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
ఇదీ చూడండి : దృశ్య కావ్యం.. రథంగుట్టలో సెలయేటి అందాలు నయనానందకరం