అన్నదాతలకు ఆసరా లభించింది. కరోనా నేపథ్యంలో కేంద్రం రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇదివరకే ప్రకటించింది. అందులో భాగంగా పీఎం కిసాన్ పథకం కింద ముందస్తుగా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం కింద ఏడాదికి పది ఎకరాల్లోపు సాగు భూమి ఉన్న వారికి రూ.6 వేలు మూడు విడతల్లో రైతుల ఖాతాలో వేస్తోంది. ఖరీఫ్ ప్రారంభమయ్యాక జూన్‌లో మొదటి విడత రూ.2 వేలను ఇవ్వాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే నిధులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
4.21 లక్షల మందికి లబ్ధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 ఎకరాల్లోపు సాగు భూమి ఉన్న రైతులు 4,21,199 మంది ఉన్నారు. వీరందరికీ రూ.2 వేల చొప్పున మొత్తం రూ.84.23 కోట్లు విడుదలయ్యాయి. వాటిని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అర్హులైన రైతులందరికీ అందుతాయన్నారు. రెండో విడత ఖరీఫ్ ప్రారంభంలోనే మరో రూ.84.32 కోట్లు ఇవ్వనున్నారు. పంటలసాగుకు అవసరమైన నిధులను ముందస్తుగా ఇస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు. మూడో విడత రబీ సీజన్ ప్రారంభంలో ఇస్తారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. వీటిని ఖరీఫ్ ప్రారంభం జూన్‌లో రూ.5000, రబీలో రూ.5000 చొప్పున అందించనుంది.
ఇదీ చూడండి : యుద్ధాలు అవసరం లేదు.. ఈమూడు పాటించండి