HC On Police Torture: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో విచారణ పేరిట పోలీసులు వేధించారన్న ఆరోపణలపై హైకోర్టు న్యాయవిచారణకు ఆదేశించింది. హత్య కేసులో బాన్యా అనే వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 3 న ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.
కాళ్లు విరిగిపోయాయి
చెన్నారావుపేట మండలం జీడితండాగడ్డాకు చెందిన బాన్య భార్య భూక్య కమలమ్మ ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాన్యా, కమలమ్మల కుమార్తె సంధ్యకు 2016లో గుగులోత్ సతీశ్‌తో వివాహం జరిగింది. తర్వాత మరో యువతిని వివాహం చేసుకున్న సతీశ్‌ను గత నెల 1న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కమలమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హత్య కేసులో తనను, తన భర్త, కుటుంబ సభ్యులను పది రోజుల పాటు పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపించారు. తన భర్త బాన్యా కాళ్లు విరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం డిసెంబరు 15న నర్సంపేట ఏసీపీకి, 21న కమిషనర్‌కి, 27న మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు.. సీఎస్ సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, వరంగల్ సీపీ, నర్సంపేట ఏసీపీ, చెన్నారావుపేట ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా చేర్చింది.
ఇదీ చదవండి: DH Srinivas on Covid Third Wave : 'మూడో ముప్పు షురూ.. వాళ్లకి సెలవుల్లేవ్..'