NIT Spring Spree Event : వరంగల్ నిట్‌లో వసంతోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా స్ప్రింగ్ స్ప్రే పేరుతో నిర్వహించే వేడుకలను ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి లాంఛనంగా ప్రారంభించారు. మూడ్రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో 50కి పైగా ఈవెంట్లు జరగనున్నాయి. దేశంలోని ఎన్ఐటీలు,ఐఐటీల నుంచి విద్యార్థులు తరలిరానున్నారు. కార్యక్రమంలో భాగంగా తనికెళ్ల భరణి విద్యార్థులతో సరదాగా గడిపారు. వారు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పద్యాలు పాడుతూ ఆకట్టుకున్నారు.
ఈ గుడికీ యునెస్కో గుర్తింపు : శిల్పసంపదకు నెలవైన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినట్లే హనుమకొండ వేయిస్తంభాల గుడికీ ఆ హోదా రావాలని తనికెళ్ల భరణి ఆకాంక్షించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో కలసి ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనికెళ్ల భరణితో పాటు ఇతర కళాకారులను వినయ్ భాస్కర్ సత్కరించారు.
సరిగమప పార్క్ నిర్మాణం సంతోషకరం : కళాకారుల ప్రదర్శనల కోసం నగరంలో సరిగమప పార్క్ నిర్మింస్తుండడం సంతోషంగా ఉందని తనికెళ్లభరణి తెలిపారు. ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల కళా సంపద గురించి మాటల్లో చెప్పలేమని... దృశ్యరూపకంగా తీయాల్సిందేనని అవకాశమొస్తే చేస్తానని అన్నారు. కళలన్నా.. కళాకారులన్నా ఎంతో అభిమానించే ముఖ్యమంత్రి కేసీఆర్... కాళోజీ కళాక్షేత్రానికి మూడు ఎకరాల స్ధలం ఇచ్చారని చెప్పారు. త్వరలోనే కళాక్షేత్రం, సరిగమప పార్కుల నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వెల్లడించారు. వరంగల్ కల్చరల్, స్పోర్ట్ హబ్‌గా మారాలని దానికి అనుగుణంగా కార్యక్రమాలతో త్వరలోనే ఓ క్యాలెండర్ రూపకల్పన జరుగుతందని పేర్కొన్నారు.