కరోనా కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ఉద్దీపన ప్యాకేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకూ లబ్ధి కలిగించనుంది. ఇక్కడి కుటీర, మధ్య, భారీ పరిశ్రమలన్నీ కలిపితే మూడు వేలకుపైగానే ఉంటాయి. పత్తి జిన్నింగ్, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఆయిల్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డెయిరీ, కోళ్ల ఫారాలు, వివిధ రకాల ఉత్పత్తుల కేంద్రాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. తాజా ప్యాకేజీ వల్ల ఇవి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులు ఏడాది వరకు వాయిదా వేసుకొనే వెసులుబాటు కలిగింది. ఫలితంగా వాటి వద్ద నగదు లభ్యత పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయవచ్చు. ఈ వెసులుబాట్ల వల్ల ఓరుగల్లులోని పరిశ్రమలకు దాదాపు రూ. 1500 కోట్లకుపైగా లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరోక్షంగా ఉపాధి
వరంగల్ నగరం సమీపంలోని మడికొండలో వస్త్ర ఉత్పత్తి యూనిట్లు 364కు పైగా ఏర్పాటవుతున్నాయి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదివేల మంది ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా జౌళి పార్కును నెలకొల్పుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలా పరిశ్రమలకు కల్పించిన ప్రోత్సాహకాలతో మేలు కలగనుంది.
చెల్లింపుదారులకు ఉపశమనం
ఆత్మ నిర్భర్ పథకంలో పరిశ్రమలతోపాటు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే విధంగా ప్యాకేజీలను ప్రకటించారు. కరోనా నేపథ్యంలో పన్ను రిటర్నులను నవంబరు వరకు వాయిదా వేశారు. జీఎస్‌టీ చెల్లింపులకు అనేక మినహాయింపులు ఇవ్వడం వల్ల చిన్నపాటి వ్యాపారులకు ఊరట లభిస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదాయపు పన్ను చెల్లించే వారే ఏకంగా 60వేలకు పైగా ఉన్నారు. ఈపీఎఫ్ చందాదారులకు 3 నెలల వరకు చెల్లించనవసరం లేదనే నిర్ణయం వల్ల ఎన్నో పరిశ్రమల యాజమాన్యాలకు ఉపశమనం కల్గుతుంది.
శరవేగంగా అభివృద్ధి
వరంగల్‌లో సాఫ్ట్‌వేర్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది మొదట్లో మడికొండలో రెండు పెద్ద సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ఇక్కడ శాఖలను విస్తరించేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటుల వల్ల పరిశ్రమలు ముందుకొచ్చే వీలుంది. విద్యుత్తు డిస్కంలకు భారీగా ఊతం ఇవ్వడం వల్ల ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) కు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్తు సరఫరాకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కార్పొరేషన్ నుంచి భారీ రుణం తీసుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది.
ఇదీ చూడండి : కూలీలతో వస్తున్న ఆటోను ఢీకొన్న లారీ...ఐదుగురికి గాయాలు