వరంగల్ గ్రామీణ జిల్లాలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొనడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కరోనా భయంతో దూరదూరంగా ఉంటూ.. సామూహిక సంబురాల్లో పాల్గొనడానికి భయపడ్డారు. చాలాచోట్ల తక్కువ సంఖ్యలో మహిళలు బతుకమ్మ ఆడారు.
జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు మాస్కులు ధరించి బతుకమ్మ ఆడుకున్నారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకునే పూలపండగ ఇలా కరోనా, అధిక మాసం వల్ల కళ తప్పిందని గ్రామీణ ప్రజలు వాపోయారు. ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ సంబరాలు ఇలా చేసుకోవాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల హడావిడి, చిన్నారుల సందడి.. ఏమి లేకుండానే బతుకమ్మ పండగ నిర్వహించుకోవడం బాగలేదంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని.. బతుకమ్మను వేడుకున్న మహిళలు వచ్చే ఏడాది బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.