లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ఊరట కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో వారం రోజులుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేసేందుకు వచ్చే వారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొత్తగా జాబ్‌కార్డులు మంజూరు చేస్తున్నారు.
క్రమంగా పెరుగుతూ...
లాక్‌డౌన్‌తో రంగాలన్నీ స్తంభించాయి. వలస కూలీల నుంచి మొదలుకొంటే అన్ని వర్గాల వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి పనులకు మాత్రం ప్రభుత్వం అనుమతించింది. సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం రాష్ట్రంలో పనులకు వెళ్లొచ్చని పలుమార్లు జరిగిన సమీక్షా సమావేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని పెంచింది. గతంలో రోజుకు రూ. 211 ఉండగా, ఇప్పుడు రూ. 237 చెల్లిస్తోంది. వేసవిలో ప్రత్యేక భత్యాలు ఇస్తోంది. వారానికోసారి అధికారులు డబ్బులిస్తున్నారు. కరోనా మొదట్లో కూలీల సంఖ్య తక్కువగా ఉన్నా ఇప్పుడు పెరిగింది.
ఉదయం ఆరు నుంచే పనులు ప్రారంభమై పదిలోపు పూర్తి చేసుకొంటున్నారు. క్షేత్ర సహాయకులను తొలగించడంతో పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 27న ఆరు జిల్లాల్లో కూలీలను పరిశీలిస్తే జనగామలో 37వేలకుపైగా, భూపాలపల్లిలో 10వేలు, మహబూబాబాద్‌లో 34 వేలు, ములుగులో 20వేలు, వరంగల్ అర్బన్‌లో 6వేలు, రూరల్‌లో 34 వేలకుపైగా పనులకు వచ్చారు. మళ్లీ మే 4న చూస్తే... జనగామలో రెండు వేలకుపైగా, భూపాలపల్లిలో 7వేలు, మహబూబాబాద్‌లో 23వేలకుపైగా, ములుగులో 4వేలకుపైగా, వరంగల్ రూరల్‌లో 7వేలకుపైగా పెరగగా, వరంగల్ అర్బన్‌లో రెట్టింపయ్యారు. కొత్తగా వచ్చే వారికి వెంటనే కార్డులు మంజూరు చేస్తున్నారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో...
ప్రస్తుతం కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో బయట పనులేమీ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులు సైతం ఉపాధి బాట పడుతూ నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. డిగ్రీ , బీటెక్ చేసి ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారూ ముందుకు వస్తున్నారు. చెరువుల పూడిక తీత, సేద్యపుగుంటలు, పీఫడర్ ఛానెల్ పనులు, ఫిష్‌పాండ్స్ తదితర మట్టి పనులను ఉపాధి హామీ కింద చేపడుతున్నారు.
జిల్లా సోమవారం కూలీల సంఖ్య జాబ్‌కార్డులు మొత్తం కూలీలు
జనగామ 39555 114575 264042
భూపాలపల్లి 17330 109611 268353
ములుగు 24263 82821 196082
మహబూబాబాద్ 57816 208797 476559
వరంగల్ రూరల్ 41958 145604 30858
వరంగల్ అర్బన్ 12253 48098 113687