ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పంట పరిహారం అందిస్తేనే వారికి మేలు జరుగుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లో వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. జరిగిన పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన పంటలను పరామర్శించిన రెడ్యానాయక్.. శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. గతంలో ఇంత తీవ్ర స్థాయిలో వడగళ్లు కురిసిన దాఖలాలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. మిర్చి, మామిడి రైతులకు 90 శాతం నష్టం వాటిల్లిందన్నారు. గ్రామాల్లో జరిగిన పంట నష్టం వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి రాతపూర్వకంగా తీసుకొని వెళ్లి పరిహారం అందించేలా కృషి చేస్తానని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తేనే ఉపశమనం కలుగుతుందన్నారు. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యేగా తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం.. వడగళ్ల వాన, ఈదురు గాలుల ధాటికి ఉమ్మడి వరంగల్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. హనుమకొండ జిల్లాలోనూ ఈదురుగాలుల తాకిడికి 5 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. పరకాల రెవెన్యూ డివిజన్‌లోని దామెర, ఆత్మకూరు మండలాల్లో మొక్కజొన్న, మిర్చితో పాటు వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. పంట కోసం పెట్టుబడి రూ.లక్షల్లో పెట్టినా చేతికి పైసా దక్కే పరిస్థితి లేదని వాపోయారు. భారీగా వర్షాలు కురవడం వల్ల పంటలు తడిసిపోయాయి. మామిడి కాయలు రాలి రైతులకు కన్నీటిని మిగిల్చాయి. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో మిరప రైతులు.. వర్షం దెబ్బకు విలవిల్లాడారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో మామిడి కాయలు.. ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
చేతికొచ్చిన పంటలు నేలమట్టం.. చేతికందొచ్చిన పంటలు గంటల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న, వరి, మిరప లాంటి పంటల రాశులు తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో భారీ వర్షానికి ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిలువ నీడ లేకుండా పోయిన తమకు పక్కా ఇళ్లు కేటాయించాలని బాధితులు వేడుకుంటున్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత రైతుల్లో భరోసా నింపారు. క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించిన శాసనసభ్యులు.. పంట నష్టం నమోదును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు తొందరగానే పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన నష్టం వివరాలు త్వరగా అంచనా వేసి పరిహారం తక్షణం అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: