కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేనట్టు చూస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ కోటాలోనే కిషన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు. అదే తెలంగాణ లేకపోతే ఎలా వచ్చేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తెలంగాణలోని వరి కొనుగోలుపై ఎందుకని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో.. కేంద్ర ప్రభుత్వం వేసిన అడ్డుపుల్ల తొలగే దాకా రైతులంతా ఏకతాటిపై ఉండి పోరాటం చేయాలని సూచించారు.
వంద సంవత్సరాల తర్వాత రెండోసారి అత్యధిక వర్షపాతం నమోదై..హైదరాబాద్ లో వరదలు వచ్చి నీట మునిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బాధ్యత మరచి నగరానికి సముద్రం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్,కేటీఆర్ దే అని మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాన్ని దేశంలో లేనట్టు చూస్తోందని విరుచుకుపడ్డారు.
రైతులను నట్టేట ముంచిన రెండు జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్ లకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆక్షేపించారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రతీ పథకం రైతులకు పండగలా మారాయన్నారు. దురదృష్టవశాత్తు అత్యధిక వర్షాపాతంతో మొత్తం పంటలు పోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి వివిధ జీవోల ద్వారా అనేక కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ఆపివేయాలని కేంద్రం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఘాటు విమర్శలు చేశారు.
ఇవీ చదవండి: 'అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి'