దిగుబడి తక్కువే... ధర తక్కువే... వాతావరణం అనుకూలించక గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మిర్చి సాగుచేసిన రైతులకు నిరాశే మిగిలింది. పురుగు మందుల ధరలు రెండింతలు కాగా... దిగుబడులు మాత్రం సగానికి సగం పడిపోయాయి. పంటకు చీడపురుగు పట్టుకొని దిగుబడులు తక్కువొచ్చాయని మిర్చి రైతులు వాపోతున్నారు. వివిధ రకాల రోగాల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎంత ఎక్కువ ధరైనా పెట్టి పురుగు మందులు కొనాల్సి వచ్చిందని వాపోయారు. పోయిన సంవత్సరం ఎకరాకు 20 క్వింటాళ్ల మిర్చి వస్తే... ప్రస్తుతం 6 నుంచి 7 క్వింటాళ్లే వచ్చిందని తెలిపారు. దిగుబడి తగ్గినా ధరైనా వస్తుందనుకుంటే అదీ లేదు. గతేడాది క్వింటా మిర్చి ధర 13 వేలుంటే... ప్రస్తుతం రూ.5 నుంచి 6 వేల మధ్యే ఉందని వాపోయారు.
మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో మిర్చి రావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మార్కెట్ కార్యదర్శి చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 వేల బస్తాల మిర్చి వస్తుందని తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మిర్చిపంటకు గిట్టుబాట ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.