Mirchi farmers problems: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ప్రారంభంలో పది, పదిహేను వేలు ధర పలికిన మిర్చి ఆ తర్వాత డిమాండ్ పెరిగి... రికార్డుస్థాయిలో 50 వేల వరకు చేరింది. ధర అంత పెరిగినా వాటి లాభాలు మాత్రం కొందరు రైతులకే దక్కాయి. అందుకు కారణం.. ఈసారి మిర్చి దిగుబడి లేకపోవడమే. వరంగల్ జిల్లాలోని మిరప రైతులను ఈ దఫా తామర తెగులు నట్టేట ముంచింది. కళ్ల ముందే పురుగుకు పంట నాశనమైనా ఏమీ చేయాలని నిస్సహాయ స్ధితిలో రైతు ఉండిపోయాడు. అప్పులు చేసి మరీ పురుగు మందులు కొట్టిన ఫలితం కనిపించలేదు.
ప్రతి ఏడు లక్షల్లో లాభాలు చూసే మిర్చి రైతులు ఈసారి తామర పురుగు ఉద్ధృతితో దారుణంగా నష్టాలు చవిచూశారు. పురుగును చంపేందుకు మందులు ఎక్కువ వినియోగించడంతో పెట్టుబడి రెట్టింపై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఉన్న పంటను సగంలోనే ట్రాక్టర్లతో తొలగించారు. గోరుచుట్టిపై రోకలి పోటులా జనవరిలో వచ్చిన అకాల వర్షాలు కర్షకుల్ని నిండా ముంచాయి. కొద్దో గొప్పో పండిన పంటా వర్షార్పణమై రైతు రోడ్డున పడ్డాడు. మిరప పంటకు శత్రువుగా మారిన తామర తెగులుకు ఇప్పటికీ శాస్త్రవేతలు అధికారులు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో రైతులు మిర్చి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు.
మిర్చిపంటపై ఆశలు వదులుకున్న రైతులు ఈసారి పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తికి మార్కెట్లో ఈ దఫా 15వేలుపైగా ధర పలకడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మిరప పంటసాగు మాని పత్తికి మారుతున్నారు. ఎక్కువ శాతం మిరప రైతులు పత్తివైపు మొగ్గుచూపడంతో పత్తిసాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పత్తి సాగు ఇంకా ఆరంభించని రైతులు త్వరగా సాగు చేపడితే పంట త్వరగా చేతికి వస్తుందని గులాబీ పురుగు బెడద ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇక అధిక సాంద్రత ద్వారా పత్తి దిగుబడి పెంచుకునే విధానంపై రైతులకు క్షేత్రస్ధాయిలో అవగాహన కల్పిస్తే జిల్లాలో ఈ దఫా పత్తి విరివిగా పండుతుంది.
ఇవీ చదవండి: భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
'తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలి.. ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేయకండి'