Lesser Whisteling Ducks In Pakala Lake : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఆ ప్రదేశాలకు కొదువ లేదు. అది ఒకప్పటి కాకతీయులు ఏలిన ప్రాంతం కాబట్టి అనేక సందర్శన ప్రదేశాలున్నాయి. వేయి స్తంభాల గుడి నుంచి మొదలు రామప్ప వరకు అనేకం ఉన్నాయి. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో పాకాల సరస్సు ఒకటి. వర్షాకాలంలో ఈ సరస్సు అందాల్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఆ సమయంలో దీన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు దూర ప్రాంతాలను నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చుట్టూ దట్టమైన అడవి మధ్యలో నీటి ఊటలా పాకాల సరస్సు ఉంటుంది. కాకతీయుల కాలంలో దీన్ని నిర్మించారు. ఇది జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. రమణీయమైన దృశ్యాలు, పక్షుల కిలకిల రాగాలు ఇక్కడికొచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలాంటి సరస్సుకు ఎప్పుడూ లేని విధంగా లెస్సర్ విజిలింగ్ బాతులు వచ్చాయి. సరస్సుకు మరింత అందాన్ని ఇచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు కానీ... పాకాల సరస్సుకు వచ్చి ఇక్కడ సేదదీరుతున్నాయి.
అసలేంటీ బాతులు..? : లెస్సర్ విజిలింగ్ డక్ లను ఇండియన్ విజిలింగ్ డక్ లేదా లెస్సర్ విజిలింగ్ టీల్ అని కూడా అంటారు. ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతానికి చెందినవి. ఇవి సరస్సులు, తడిగా ఉన్న ప్రాంతాలు, వరి పొలాల దగ్గర అధికంగా కనిపిస్తాయి. చూడటానికి పొడవాటి మెడ, పసిడి వర్ణం, విశాలమైన రెక్కలు కలిగి ఉంటుంది. అవి ఎగిరినప్పుడు విమానాన్ని తలపిస్తుంది. వీటి అరుపులు అచ్చం పక్షుల్లాగానే ఉంటాయి. అవసరమైతే ఇవి చెట్ల తొర్రల్లో గూళ్లను ఏర్పరచుకుని నివసిస్తాయి. ఇవి సాధారణంగా గుంపులుగా ఉండి చిన్న చేపలు, పురుగులు, వరి ధాన్యాలను తింటాయి. మన దేశంలో ఎక్కువగా తడి ప్రాంతాలైన కోల్‌కతా, గోవా ల్లో శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.
ముఖ్యంగా వాతావారణంలో మార్పుల వల్ల ఇవి ఒక ప్రాంతం నుంచి మరో అనువైన ప్రాంతానికి వలస వెళతాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. ఇవి అతి శీతల ప్రాంతాల నుంచి వేసవి ప్రాంతాలకు తరలివచ్చి మూడు నెలల పాటు సేద తీర్చుకొని వాటి సంతతిని పెంచుకొని మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్తాయని అంటున్నారు. పాకాల సరస్సు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వీటి రాక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అటవీ అధికారులు అంటున్నారు. వీటికి ఎలాంటి హాని జరగకుండా నిత్యం నిఘా ఉంచుతున్నామని ఎఫ్ఆర్వో రమేష్ తెలిపారు.
"పక్షులకు పాకాల అభయారణ్యం స్వర్గధామము. ఉత్తర భారతదేశంలో అవి వాతావరణాన్ని తట్టుకోలేక.. ఎన్నో వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి ఇక్కడకు వచ్చాయి. ఈ సీజన్‌లో అవి గుడ్ల పెట్టి.. వాటిని పొదిగి వాటి సంతతిని పెంచుకొని.. ఇక్కడ నుంచి మూడు నెలలు తర్వాత వెల్లడం జరుగుతుంది." - రమేశ్, అటవీ శాఖ అధికారి
ఇవీ చదవండి: