వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరికి చెందిన మంతుర్తి కుమారస్వామి సన్నకారు రైతు. పైసా.. పైసా పోగుచేసి కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని లాక్కొని తమకు అన్యాయం చేయొద్దంటూ.. తహసీల్దార్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. పర్వతగిరి శివారులోని సర్వే నెం 731లోని భూమిలో హద్దులు నిర్ణయించడానికి శనివారం తహసీల్దార్ మహబూబ్ అలీ ఆ ప్రాంతానికి వెళ్లారు. సర్వే నెం 731లో తనకు 1.35 ఎకరాల భూమితో పాటు సర్వే నెం 769లో 2.35 ఎకరాల భూమి ఉందని తహసీల్దార్‌కు విన్నవించుకున్నాడు.
కావాలనే తన భూమిని లాక్కుంటున్నారని రైతు ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను ఈటీవీ భారత్ సంప్రదించగా... 731 సర్వే అసైన్డ్ నెంబర్‌లో భూమి ఉందని, రూర్బన్ పథకంలో భవన నిర్మాణం కోసం ఆరుగురు రైతుల నుంచి ఐదెకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు. ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని రైతుకు సూచించినట్లు చెప్పారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని భూమికోసం ప్రాణాలైనా వదిలేస్తామని రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.