రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు.. తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లిలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింప జేశారు.
మండలంలోని మూడు చక్కలపల్లి, గాంధీ నగర్, మామిండ్ల వీరయ్య పల్లెకు చెందిన పలువురు రైతులు.. స్థానిక రంగయ్య చెరువు కాల్వల నిర్మాణం కొరకు ప్రభుత్వానికి భూములను ఇచ్చినట్లు తెలిపారు. కాలువ కోసం ఇచ్చేసిన 10 గుంటలు పోగా.. మిగతా భూమికి రావాల్సిన రైతుబంధు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా.. అధికారులు కనీసం పట్టించుకోలేదన్నారు.
అందుకే తాళం వేశాం..
ఎన్నోసార్లు తహసీల్దార్‌ను కలిశాం. ఎప్పుడొచ్చినా.. మా చేతుల్లో ఏమీ లేదు అంటారు. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్‌ను సంప్రదించండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అధికారుల వైఖరి పట్ల విసిగిపోయాం. రైతులకు సాయపడని కార్యాలయమేందుకని.. ఆఫీసుకు తాళం పెట్టేశాం.
- బాధిత రైతులు
ఇదీ చదవండి: గుడిసెల తొలగింపు: 'కోర్టు స్టే ఉన్నా పోలీసుల దౌర్జన్యమేంటి..?'